Interview with Shri Sirivennela Sitarama Sastry

తెలుగు సాహిత్య రంగంలో ఎప్పటికీ నిలిచిపోయే స్ఫూర్తిదాయకమైన వ్యక్తి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. 11 సార్లు నంది పురస్కారం, 4 సార్లు ఫిలింఫేర్ పురస్కారం గెలుచుకున్న ఈ ప్రముఖ సినీ గీత రచయిత ఐ.ఐ.టి మద్రాసులోని  EMLవారు తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా ఉపన్యాసాల సందర్బంగా ఇక్కడికి విచ్చేసిన సందర్బంగా T5E, వారితో చిన్న ఇంటర్వ్యూ నిర్వహించింది.

ఈ సందర్బంగా T5E కరెస్పాండెంట్స్ రామ్ చరణ్, శృతిలతో  ఆయన తెలుగు సాహిత్యం, భాష, ఇంకా వివిధ అంశాలపై వారి ఆలోచనలను పంచుకున్నారు.

మీరు రాసిన ఎన్నో పాటలు ఎంతో మందికి స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచాయి. ఉదాహరణకి “తరలిరాదా తనే వసంతం”, “ఆకాశం తాకేలా”, “జగమంత కుటుంబం నాది” మొదలైనవి. ఇలా మీ జీవితంలో ప్రేరణగా నిలిచిన పాట గురించి కాని ప్రేరణగా నిలిచిన, ప్రోత్సహించిన వ్యక్తి గురించి కాని మాతో పంచుకుంటారా?

(కొంతసేపు అలోచించి..) నా ఆలోచనా సంవిధానానికి ప్రత్యేకమైన స్ఫూర్తి అంటూ ఎక్కడ నుంచీ రాలేదు. మొట్టమొదటిగా చెప్పాలంటే మా నాన్నగారు నన్ను పెంచిన విధానం. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయనకు తెలియని విషయాలు చాలా తక్కువ. ఆయన అంతటి విశాలమైన జ్ఞానం ఉన్న ‘జీనియస్’. ఆయనకు దృక్పథం గురించి స్పష్టమైన అవగాహన ఉండేది. ఒక వస్తువుని, ఒక ప్రక్రియను మనం ఎలా చూస్తున్నాం, ఎలా చూసుండాలి అని ఆయన నిత్యం ఆలోచించేవారు. ప్రాధమికంగా ఆయన వైద్యుడు కావడం కూడా ఆయన ఈ ఆలోచనా విధానానికి కారణం అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ ఒక జబ్బుకు సంబంధించిన లక్షణాలకి మందు ఏంటి అని కాకుండా దానికి కారణం ఏమయ్యుంటుందీ అని ఆలోచించేవారు. ఆ ఆలోచనా విధానమే నాకు కూడా వచ్చింది. నేను పెద్ద కొడుకుని కావడం వాళ్ళ చిన్నతనంలో ఆయన అనేక అంశాల మీద నాకు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ ఒక పరీక్షలా పెడుతుండేవారు, ఇది ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది అంటావ్ అని అడిగేవారు. తొందరపడద్దు, తీరికగా అలోచించి చెప్పమనే వారు. దాంతో ఆయన నన్ను ఆలోచించుకోనిచ్చేవారు. ఇదే (పరిశీలించడం) ఆ తరవాత క్రమంగా నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

ఈ దేశం అనేక సమాజాల, అనేక భాషల సమూహం. కానీ వివిధమైన భాషలున్నప్పటికీ కూడా అంతః సూత్రం ఒకటే ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఒక్క భారత దేశంలో మాత్రమే జరుగుతుంది. ఐరోపాలో అంతా ఒకటే భూఖండం ఉంది. వాళ్ళ మతం, భౌగోళిక జీవన విధానం ఒకటే, కానీ వాళ్ళలో వాళ్ళకి అంత సఖ్యత ఉండదు, ఒకరంటే ఒకరికి అంతలా పడదు. వాళ్ళు ప్రయత్నం చేసారు కనీసం ఆర్థిక పరంగా అయినా ఒకటి అవ్వాలని యూరో ద్వారా, కానీ కాలేకపోయారు. వాళ్ళకి లేని అనైక్యత, మనకు ఉండవలసిన, ఒకప్పుడు ఉందీ అనుకున్న ఐక్యత ఏమిటంటే  ఆలోచన విధానం.

భారతీయుల చింతనా విధానం ఒకేలా ఉంటుంది. భారతీయులందరి జీవితాలు పెనవేసుకుని ఉన్నాయి, విడిగా లేవు, మనం తల్లిదండ్రులను చూసే విధానం, మన కౌటుంబికమైన విధానం, మన సాంఘికమైన విధానం, వీటిలో మన ఆలోచనా సరళి ఒకేలా ఉంది.ఇది చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా బలంగా కూడా ఉంది.

అందువల్ల మనం చెప్పుకోవలసి వస్తే మా మాతృభాష భారతీయ భాష అని , మా ప్రాంత భాష తెలుగు అని చెప్పుకోవాలి.

నేను సినిమా రంగంలోకి అడుగు పెట్టింది, నలుగురూ నా గురుంచి చెప్పుకోవాలని కాదు. పాట ద్వారా నా అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది అని వచ్చాను. మీ ప్రశ్నకు చిన్నగా సమాధానం చెప్పాలంటే,

నా మౌలికమైన ఆలోచనా సంవిధానమే నా స్ఫూర్తి, నా గురువు, అదే నా పాట, ఆ పాటే మళ్ళీ మీకు (శ్రోతలకు) స్ఫూర్తిదాయకం అవుతుంది.

ఇన్ని దశాబ్దాల మీ కవితా కవిత్వ యాత్రలో, మీరు ఎన్నో రకాల పాటలు రాసి ఉన్నారు. రోజులూ, సినిమాలూ మారుతూ ఉండగా, మీరు మీ రచనా శైలిని మార్చ వలసి వచ్చిందా? ఏ విధంగా? ఈ మార్పు మీకు నచ్చే చేశారా?

ప్రేక్షకుల అభిరుచులు మారేకొద్దీ నేను నా శైలి యొక్క పై రూపాన్ని మారుస్తాను, అంతేకానీ నేను చెప్పాలనుకున్న ప్రధాన విషయాన్ని మార్చను. ఇది ఎలా అంటే ఉదాహరణకు ఔషధాన్ని ఈ రోజుల్లో క్యాప్స్యూల్స్ లో పెట్టి ఇస్తున్నారు, ఔషధం యొక్క చేదు నేరుగా మనకు తెలియకుండా. నా సాహిత్యం విషయంలో కూడా ఇదే చేస్తాను. బ్రిటిషువారు వెళుతూ వెళుతూ వాళ్ళ  భాష, సంస్కృతి గొప్పవనే భావాన్ని మనకు వదిలేసి వెళ్లిపోయారు. ఈ రోజుల్లో అందరూ కార్పొరేటు కళాశాలల్లోనే చదువుతున్నారు. మరి నేను వాళ్ళకి నా పాట ద్వారా ఏమైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి, దానికి నాకొక ఆలోచనా విధానం ఉంది.

ప్రపంచంలో అందరూ కన్నవారిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ ఒక మన దేశంలోనే  కన్నవారిని దైవంతో సమానంగా చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటాం. ఇదే ఈ తరం వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్పాలి? అప్పుడు నేను తప్పనిసరిగా మమ్మీ డాడీ అనే చెప్తాను. వాళ్ళకు కావాల్సింది అమ్మంటే దైవం అని తెలియాలి, అందుకని “Mummy is god” అని చెప్తే వచ్చే నష్టమేమీ లేదు. ఇలా ఈ తరం వారికి తగినట్లే చెబుతాను. మరో ఉదాహరణ చెప్పాలంటే, జల్సా సినిమాలో “ఏ జిందగీ” అనే పాటలో నేను ఇలా రాసాను “బొటానికల్ భాషలో పెటల్సు  పూరేకులు…….అనాటమీ ల్యాబ్ లో మనకి మనం దొరకం”. ఇక్కడ నేను ఇంగ్లీషులో రాయడానికి కారణం నేటి తరం పెరుగుతున్న వాతావరణానికి తగినట్లు ఉండడానికి. కానీ ఇందులో భావం మాత్రం భారతీయ సంస్కృతికి సంబంధించినది, మనిషి అంటే అనాటమీ ల్యాబ్ లో ఉండే నమూనా కాదు, మనిషి అంటే శరీరం కాదు, దానికంటే చాలా ఎక్కువ. ఆ దానికంటే ఎక్కువ ఉన్నదాన్ని గురించి అన్వేషించే సంస్కృతి మనది. ఈ విషయం చెప్పడం నా ఉద్దేశం, అదే ఈ తరానికి సులభంగా అర్ధం అయ్యేలా చెప్పాను.

సాధారణంగా కాలం మారిందీ అంటుంటారు. కానీ నేను దీనితో సమ్మతించను. నా ప్రకారం కాలం ఎప్పటికీ మారదు, కాలం మారడం ఎలా సాధ్యమవుతుంది? ఈ పంచ భూతాలలో ఏ ఒక్కటీ ఎప్పటికీ మారదు. మనం చూసే సంవిధానం మారుతూ ఉంటుంది. మనం చూసే విధానంలో తేడా వచ్చింది కానీ కాలంలో రాలేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇంతకముందు హంసలా నడిచేది(హంస నడక) అనే వాళ్ళం. ఇప్పుడు పిల్లిలా నడవడం(catwalk) అంటున్నాం. ఇలా అభిరుచులు మారుతున్నకొద్దీ అవి మన మీద ఎలా పనిచేస్తున్నాయి, మన ముందు తరాలతో ఎలా అనుసంధానిస్తున్నాయి, మన తర్వాతి తరాలతో ఎలా అనుసంధానిస్తాయి అని మనం నిరంతరం ఆలోచించుకుంటూ ఉండాలి. మాకు సమయం లేదండీ, పరీక్షలు ఉన్నాయ్ అండీ అని అనడం సరి కాదు. నిజమైన పరీక్ష జీవితం, ఈ పాఠశాలల్లో పెట్టే పరీక్షలు మార్చ్ లో కాకపోతే సెప్టెంబర్ లో రాసుకోవచ్చు, జీవితం పోతే మళ్ళీ రాదు. అందువల్ల వీటికి మాత్రం సమయం కేటాయించాలి. ఉన్న సమయాన్ని సవ్యమైన ఆలోచనా విధానంతో గడపడం అలవరచుకోవాలి.

మీరు అన్ని రకాలైన పాటలూ రాశారు. కానీ మీకు ఇంకా ఏదైనా ఒక  ప్రత్యేకమైన శైలికి సంబంధిచిన పాట, ఒక కలల పాట లాంటిది రాయాలని అనుకున్నది ఏమైనా ఉన్నాయా?

మనకి ప్రతీ రోజూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ప్రతీ క్షణం ఒక కొత్త అనుభూతే. కాబట్టి ఎన్ని పాటలు రాయొచ్చు అంటే ఆకాశమే అనొచ్చు. సినిమా కవిగా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే దేని గురించి రాయాలన్నది మనం ఆలోచించక్కర్లేదు, వాళ్ళు(దర్శక నిర్మాతలు) దేని గురించి రాయమంటే అదే రాయాలి, కాబట్టి ఇచ్చిన సమయం లోపు త్వరగా ఆ విషయం గురించి అలోచించి రాయాలిసుంటుంది. ఇప్పటివరకూ 3000 సార్లు రాసాను, ఇంకా ఎవరు ఎన్ని సార్లు రాయమన్నా రాస్తాను. నాకు ఓ ప్రత్యేకమైన శైలికి సంబంధించిన పాట రాయాలని అనుకున్నది ఏమీ లేదు, ఏ శైలికి సంబంధించిన పాట రాయడానికైనా సిద్దమే. కాకపోతే నేను రాసే ప్రతీ దానికీ ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాను, అలా రాయగలిగిన ఏ శైలి అయినా, ఎన్ని పాటలు అయినా రాస్తాను.

తెలుగు సాహిత్యాన్ని ఒక వృత్తిగా, ఒక జీవిత బాటగా తీసుకునే యువతను ఇప్పుడు ఇంచు మించు ఎక్కడ చూడలేక పోతున్నాము కదా… దీని వల్ల మన భాష నిర్వీర్యం అవ్వడానికి ఆస్కారం ఉంది అంటారా? మన రాష్ట్ర విద్యా విధానం మారితే పరిస్తితి ఏదైనా బాగుపడుతుందా?

భాష నిర్జీవం అవ్వడం అనే మాట తప్పు. ఏ భాషైనా ఒక నది లాంటిది, అది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ చూసే దృక్పథం బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ ఎవరైనా రాజమండ్రిలో కోటిలింగాలరేవు వద్ద నుంచుంటే వారిని ఏం చేస్తున్నావ్ అంటే గోదావరి ఒడ్డున ఉన్నా అంటారు. ఇక్కడ గోదావరి అంటే ఏంటి? వారు నుంచున్న గట్టా? లేక చూస్తున్న నీరా? చూస్తున్న నీరు అయితే తరవాతి క్షణంలోనే అది అక్కడ ఉండదు. ఒకవేళ గట్టు అయితే మరి ఇంకా చాలా గట్లు ఉన్నాయిగా, బాసర, కొవ్వూరు మొదలైనవి. మరి ఏ గట్టు గోదావరి? ఏ రోజు గోదావరి? ఒకరోజు ఎండిపోతుంది, ఒకరోజు ఉధృతంగా వెళ్తుంది. గోదావరి అంటే ఒక నీటి ప్రవాహం కాదు, ఒక నీటి ప్రవాహం తాలూకు పుట్టుక, ప్రయాణం, దాని వెనకాల ఉన్న ఒకానొక చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రయాణాన్ని మనము నది అంటున్నాం తప్ప ఆ నీటిని కాదు. మనం ఇప్పుడు మాట్లాడే తెలుగు నన్నయగారి కాలంలో మాట్లాడింది కాదు. ఆంధ్ర చక్రవర్తులైన శాతవాహనులు అసలు మనం ఇప్పుడు మాట్లాడే తెలుగులోనే మాట్లాడలేదు. వాళ్ళు ప్రాకృతంలో మాట్లాడేవారు.

అసలు భాష తాలూకు ప్రయోజనం ఏమిటీ అనేది  మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు భాషను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భాష మూడు రకాలుగా మాట్లాడతాం. మొదటిది ప్రాథమిక అవసరాలకి. నిజానికి దీనికి భాష అక్కర్లేదు, నాకు కోపంగా ఉంది, దాహంగా ఉంది, ఇలాంటివి భాష వాడకుండా కూడా సులభంగా చెప్పొచ్చు.  రెండవ స్థాయి ఏమిటంటే సాంఘికమైన భాష. ప్రాకృతికంగా సంభాషించుకోవడం వీలు కానప్పుడు ఈ సాంఘికమైన భాష అవసరం. ఇది మనం సాధారంగా మాట్లాడుకునే భాష. ఇవి కాకుండా అసలు మనిషై పుట్టినందుకు మనల్ని కొన్ని ప్రశ్నలు వెంటాడతాయి. దేని ద్వారా మనం చెట్టు కంటే వేరుగా ఉన్నాం, ఒక జంతువు కంటే వేరుగా ఉన్నాం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కోసం వాడేది నిజమైన భాష. ఆ భావాలు  చెప్పడానికే సాహిత్యం అవసరం అవుతుంది, అలాంటి భాషను సారస్వతము అంటారు. ఇది సాహిత్యానికి సంబంధించినది.

అసలు భాషను కాపాడుకోవడం అంటే ఏమిటీ? ఉదాహరణకు తెలుగులో నాన్న అనే అర్థం వచ్చేలా ఒక ఆరేడు పదాలు ఉన్నాయి. వీటిలో ఏ పదాన్ని కాపాడితే మనం తెలుగుని కాపాడినట్టు?

భాష అనేది పదాలలో ఉండదు, అది ప్రసారం చేసే భావంలో ఉంటుంది.

ప్రస్తుత తరం లోని ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు తెలుగు లో కన్నా ఆంగ్లంలో మాట్లాడడమే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ సంస్కృతిపై మీ అభిప్రాయం? దీనిని నిర్మూలించడానికి మనం ఎం చేయాలి అంటారు?

నా ప్రకారం ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ తెలివైనవాళ్ళు, ఎక్కువ శక్తిమంతులు తెలుగువాళ్ళు. చారిత్రకంగా ఎక్కువ దెబ్బలు తగలనివాళ్ళు కూడా మనమే(తెలుగువాళ్ళు). ఎందుకంటే మనం వింధ్యకు ఇవతల(దక్షిణాన) వైపుకు ఉన్నాం, ఎక్కువ దాడులు వింధ్యకు అవతలే(ఉత్తరాన) జరిగాయి. పైగా మన భాష సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందువల్ల మనం మనకు కావాల్సిన జ్ఞానాన్ని సులభంగానే పొందాం. అదే కాకుండా, ఇప్పుడు, ఇంగ్లీషే  మాట్లాడాలి లేకపోతే ప్రపంచంలో బ్రతకలేం అనే భావం కూడా మనకే ఉంది. పెద్దపెద్ద చదువులు చదుకున్న ఉత్తరాది, ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇంత పిచ్చి లేదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలైన చైనా,ఫ్రాన్స్, జర్మనీ మొదలైనవి ఏవి ఇంగ్లీషు మాట్లాడవు. అక్కడి ప్రభువులు వాళ్ళకి అందించిన భావజాలాన్ని, వాళ్ళు మోసుకుంటూ వెళ్తున్నారు. కానీ మనం మన పూర్వీకులను కాకుండా బ్రిటిష్ వారు అందించిన దానిని మోస్తున్నాం. దీన్ని ఎలా తొలగించుకోవడం అంటే ఇది సాంఘికంగా కానీ, వ్యవస్థాపరంగా కానీ జరిగే చర్య కాదు. ఇది వ్యక్తిగతంగా జరగాలి. మనకు మనమే ప్రశ్నించుకోవాలి. మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు అని ప్రతీ ఒక్కరు చీపురు పట్టుకుని దేశాన్ని తుడవడానికి రాలేదు. ఏదైనా మనకు మనం అన్వయించుకుంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ మార్పు అనేది ప్రతి వ్యక్తి నుంచి రావాలి. ఇలా వ్యక్తి నుండి మార్పు రాగలిగే తరుణం, మీ(విద్యార్థులను ఉద్దేశించి) వయసు వారి నుంచే రావాలి. మీరు(విద్యార్థులు) తీసుకురావాలి. భవిష్యత్తులో మీరు దేశ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ భాషల్లో పడిపోయే బదులు మన భాష నిలబెట్టుకోవాలి. అలాగని ఆ భాషలు మాట్లాడకూడదని కాదు. ముందు మన భాష, సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చి, అవి నిలబెట్టుకుని, ఆ తరువాత వేరే సంస్కృతులను కావాలంటే నేర్చుకోవచ్చు.

ఈ క్రింది ప్రముఖుల గురించి ఒక మాట/వాక్యంలో (ర్యాపిడ్ ఫైర్..)

* కె. విశ్వనాధ్ గారు

జ. భారతీయతను ప్రపంచానికీ, భారత దేశానికీ పరిచయం చేసిన వ్యక్తి..

* ఎస్.పి.బాలు గారు

జ. ఉత్తమమైనటువంటి గాయకుడుతో పాటు ఉత్తమమైనటువంటి మానవుడు..

* రామ్ గోపాల్ వర్మ గారు

జ. (కొంతసమయం అలోచించి) ఎనిగ్మా (Enigma)

* త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు

జ. చక్కగా, హాయిగా , కాలక్షేపంగా, తెలుగుదనం పరిచయం చేసే మనిషి..

* తనికెళ్ళభరణి గారు

జ..చాలా విద్యల్లో వేలు పెట్టినవాడు..

*మీ శ్రీమతి గారు

జ.  నేనిలా మాట్లాడడానికి కారణమైన వ్యక్తి (చిరునవ్వులు..)..

చివరిగా మా విద్యార్థులకి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా..

నేను సందేశం ఇవ్వడానికి రాలేదు, విద్యార్థులతో స్నేహం చేయడానికి వచ్చాను.(నవ్వుతూ…) ఎందుకంటే విద్యార్థులు సందేశాలు పుచ్చుకునేంత అమాయకులు కారు. నేను కూడా మీ (విద్యార్థుల)వయసు దాటి వఛ్చిన వాడినే, విద్యార్హులు సాధారణంగా ఎం చెప్తారనే కుతూహలంతనే వస్తారు. ఎవరైనా సందేశం ఇవ్వబోతే, వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది.సందేశం ఇవ్వకండి, వాళ్ళతో సావాసం చేయండి.

Write a Comment

Your email address will not be published. Required fields are marked *